ఈడెన్ గార్డెన్ల గుర్వారం శ్రీలంక తోని జర్గిన నాల్గో వన్డేల భారత్ శ్రీలంకను 153 రన్నులతోని ఓడించింది.భారత ఆటగాడు తెలుగు పిలగాడు రోహిత్ శర్మ రికార్డులే రికార్డులు సేసిండు.రోహిత్ శర్మ ఒక్కడే 264 రన్నులు చేసి ప్రపంచ రికార్డు తిరగరాసిండు.గింతక ముందు 219 రన్నులతో సెహ్వాగ్ ముందుండే,సెహ్వాగ్ ను దాటేసి ఎవ్వరి తరం కాని 264 రన్నులు సేసిండు.
రోహిత్ శర్మ కొడ్తంటే శ్రీలంక బౌలర్ల మొహాలు సూడలే,ఏడుపే తక్కువ.రోహిత్ కొట్టుడుకొట్టుడుకు బిత్తరపోయి సూడడమే ఆళ్ళు పనెట్టుకున్నరు.గా షాక్ ల బంతిని ఆపాలనే సోయి కూడా పోయింది శ్రీలంక ఆటగాళ్లకు.కెరీర్ ల రెండు సార్ల డబుల్ సెంచరీలు సేసింది మాత్రం ఒక్క రోహిత్ ఒక్కడే.గిద్వరకు ఆస్ట్రేలియా పైన రోహిత్ 209 రన్నులు కొట్టిండు.ప్రపంచ కప్పుకు రోహిత్ పోవాల్నంటే గీ మ్యాచ్ మస్తు ముఖ్యం రోహిత్కు.ఊకుంటడ,రోహిత్ అంటే గిట్ల అని సూపిచ్చిండు.
వన్దేలల్ల డబుల్ సెంచరీ అంటే మస్తు కష్టంగ ఉండే.సచిన్ మొదగాల వన్డేలల్ల డబుల్ సెంచరీ సేసి తొవ్వ సూపించినంక సెహ్వాగ్,రోహిత్ గా తొవ్వల నడ్సి డబుల్ సెంచరీలు సేసిర్రు.వన్డే క్రికెట్ల మొత్తం 4 డబుల్ సెంచరీలు ఐతే,నాలుగుకు నాలుగు మనోల్లె సేసిర్రు.
టాస్ గెల్సిన కోహ్లి ముందుగాల బ్యాటింగ్ సేత్తం అని డిసైడ్ అయిండు.గీ సీరీస్ ల ఫస్టు మ్యాచ్ ఆడుతున్న రోహిత్ తోని రహనే ఓపెనర్లు గా వచ్చిర్రు.రోహిత్ మొదగాల 20 బంతులు ఆడి 6 రన్నులతో నిమ్మలంగా ఆట స్టార్టు సేసిండు.ఇంకో దిక్కు రహనే శ్రీలంక బౌలర్లను దంచుతనే ఉన్నడు.28 రన్నులు కొట్టి రహనే ఔటయిండు.గింతకంటే ముందుగాల రోహిత్ 4 రన్నుల తాన ఉన్నప్పుడు పెరేరా క్యాచ్ జారిడ్సిండు.గంతే శివరాఖర్కి పెరేరాను తిట్టుకొని శ్రీలంక అభిమాని ఉండడెమో.
రాయుడు(8) అట్లోచ్చి ఇట్ల పోయిండు.కోహ్లీ రాంగనే రోహిత్ కు ఏమైందో ఏమో దంచుడు షురు సేసిండు.72 బంతులకు 50 రన్నులు చేసిన రోహిత్ శ్రీలంక బౌలర్లకు సుక్కలంటే గిట్లుంటయని సూపిచ్చిండు.ఏ బౌలర్ బంతేసినా కొట్టుడే కొట్టుడు.ఏ మాటకు ఆ మాట సేప్పుకోవాలే,శ్రీలంక ఆటగాళ్లకు ఉరికే బాధ తప్పించ్చిండు రోహిత్.కొడ్తే బంతి ఫోరా,సిక్సా అనే సూసుకున్నారు.సెంచరీ తాన కూడా సిక్సులు ఫోర్లె.రోహిత్ కొడ్తంటే ఆగమాగామయ్యిర్రు శ్రీలంక ఆటగాళ్ళు.ఇంకో దిక్కు ఒక్కో రన్ను తీత్తు రోహిత్ కే బ్యాటింగ్ చేసే చాన్సు ఇచ్చిండు కోహ్లీ.సిన్నగా 150 దాటిండు,గట్లనే 200 కూడా దాటిండు.గీ మధ్యల మూడో వికెట్కు కోహ్లి తో కల్సి 202 రన్నులు కూడబెట్టిండు రోహిత్. రైనా(11) కూడా వచ్చిండు,ఔటై పోయి కుసుండు.గప్పుడు భారత్ స్కోరు 40.2 ఓవర్లల్ల 276-4.
శానా దినాల తర్వాత టీమ్ లకొచ్చిన ఊతప్ప ఒచ్చినంక స్కోరు ఆగకుంట ఉరికింది.సెహ్వాగ్ స్కోరును దాటేసిన రోహిత్ 250 కూడా దాటిండు.ఇద్దరు కల్సి 128 రన్నులు సేత్తే గల్ల ఊతప్ప సేసింది వొట్టి 16 రన్నులే,గట్ల శ్రీలంక బౌలర్లను కొట్టిండు రోహిత్.50 ఓవర్లు అయిపోతై అనంగా ఆఖరు బంతికి ఔటైండు రోహిత్ 264 రన్నుల దగ్గర.
405 రన్నులు కొట్టనీకి వచ్చిన శ్రీలంక ఓపెనర్లలో ఒక్క రన్నుకూడా సేయకుండనే ఫస్టు వికెట్ పోయింది.మొదగాల 4 వికెట్లు 48 రన్నులకే పోయి మేం గెల్వం అని సేప్పకనే సేప్పిర్రు శ్రీలంక బ్యాట్స్ మెన్.కొంచం సేపు మాథ్యుస్(75),తిరిమన్నే(59) గెల్పీయనీకి తన్లాడిర్రు,కాని ఆళ్ళ వల్ల కాలే.శివరాఖరకు వచ్చేపాల్కి 43.1 ఓవర్లల్ల 251 కొట్టి అందరౌటైర్రు.
కులకర్ణి 4 వికెట్లు తీసుకుంటే,బిన్నీ,ఉమేష్ యాదవ్,అక్షర్ పటేల్ లు రెండ్రెండు వికెట్లు తీసుకుర్రు.
రోహిత్ శర్మకు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ ఇచ్చిర్రు.
శివరి మ్యాచ్ నవంబర్ 16 న రాంచిల జర్గుతది.గల్లనన్న శ్రీలంకోల్లు గెల్తారో లేక మనోల్లె గెల్సి 1982 తర్వాత శ్రీలంకను పురాగ ఓడగోడ్ తరో సూడలే.
Post a Comment